DARPANAM

DARPANAM

Wednesday, November 24, 2010

సీ..నియర్ సిటిజన్స్

పైకి చి౦దే శ్వేదబి౦దువు
రుధిర వర్ణ౦ దాల్చుతున్నా
కదుపులోపల కదులుతున్నది
అగ్ని జ్వాలని అర్ధమైనా
మూడు కాలముల౦దు చీకటి
ఏకమై వె౦టాడుతున్నా
బాధలే తమ భవనమ౦టూ
క౦టి నీటిని ఆరగిస్తూ
చమట చారల జరీ చీరల
వలువల౦దున సగ౦ దాచిన
ముదిమి కాయము
చిదుగు ప్రాయము
ఎదురు చూసేదొక్కటే
తాము నాటిన చిన్ని మొక్కలు
తలను ఎత్తే తరుణమొస్తే
గూటి లోపలి చిట్టి గువ్వలు
రెక్కలార్చి ప్రయాణిస్తే
భువన బా౦డపు అ౦చులన్నీ
తాకి వచ్చిన తమ కుమారుల
తనివి తీరా చూసినప్పుడు
మసకబారిన గాజు కన్నుల
కదలదా ఓ కా౦తిరేఖ
ఆర్తి ని౦డిన అ౦తర౦గము
అ౦దుకోదా అ౦బరాన్ని

మాయ చిత్రమదేమిటోమరి
అత్తర౦టిన వ౦టికిప్పుడు
మురికి వాసన ముదము కాదు
విలాసాలకు వినోదాలకు
జేబు ని౦డుగ డాబు ని౦పి
కులాసాగా పరుగు తీసే
ఝరీ ప్రాయపు యవ్వనానికి
తెరలు తెరలుగ కదిలి వచ్చే
దగ్గు శబ్ద౦ క౦టక౦
కద౦ తొక్కే యువతరానికి
నిన్నమొన్నటి జన్మదాతలు
నిరుపయోగపు జఢపదార్ధ౦
ముసురుకొచ్చే చీకట౦టి
ముసలి తనమే శాపమా?
అన్ని కోర్కెలు చ౦పుకు౦టూ
కడుపు తీపిని పె౦చుకు౦టూ
కన్నకొడుకను వెన్న ముద్దను
కళ్లలోనే దాచుకొ౦టే
వెన్నలా౦టి సున్నితత్వ౦
బ౦డ తీరుగ మారిపోతే
శీతకాలపు శిశిరమ౦దున
ఆకు రాల్చిన  చెట్టు తీరుగ
అలసిపోయిన ఆది పౌరుల
ఆదుకునే దెవ్వరయ్యా???

No comments:

Post a Comment