DARPANAM

DARPANAM

Tuesday, December 15, 2015

  వెన్నెల దారి 
మూడొంతుల పయనం
 చీకటి గమనం
అడివంతా పల్లేరుకాయలే
మధ్య మధ్యలో
బ్యోరోక్రసీమార్క్ దువ్వెనల
పలకరింపు
శీతలపవనాలూ,గ్రీష్మతాపాలూ
నీకు అనుభవాలే గాని
ఆటంకాలు కావు
పీడితుల కన్నీళ్లు
తుడవాలనే కోరికే వెన్నెలై
వేకువకు
దారి చూపిస్తుంది
నిశ్చల సుషుప్తిలో నిఖిల జగతి
నీరవ నిశీధిలో నీ పయనం   

Friday, December 11, 2015

                                  ప్రపోజల్          

 "ఎంత వేర్రిబాగుల్ది కాకపోతే అలాంటి ప్రపోజల్ కి ఒప్పుకుంటుది తను". అసహనంగా బయటకే అనేసింది వసుంధర. ప్రక్కనే కూర్చున్నకొడుకు తేజ తల్లివైపు చిరాగ్గా చూసి "ఏంటమ్మా ఇది కాసేపు స్తిమితంగా కోర్చోవచ్చుకదా?ఎలాగూ నాన్నగారిదగ్గరికే కదా వెళ్ళేది"కోపంగా ప్రారంభించినా కాస్త ఓదార్పుగానే చెప్పాడు. 
ఆటోలో కూర్చుంది అన్న మాటేగాని వసుంధరకు మనసు మనసులో లేదు. తేజ స్మార్ట్ ఫోన్ సహాయంతో "లాటిట్యూడ్"ఉపయోగించి తండ్రి శ్రావణ్ ఉన్న ఏరియాను కనుక్కుంటూ ఆటోడ్రైవర్ కు దారిచూపిస్తున్నాడు. 
                                "ప్రతినెలా ఎనిమిది వేల రూపాయలంటే మాటలా,ఎవరికిస్తున్నాడో ఎం చేస్తున్నాడో ఈరోజు ఆ విశయం తేలి పోవాల్సిందే"ంఅనసులో అనుకున్నాక వసుంధర మనసు తేలిక పడింది. 
                                 ఆరోజు పెళ్ళిచూపుల ఘట్టం ఇప్పటికీ మనసులో కదలాడుతూనే ఉంది. తనవాళ్ళు 
కట్నకానుకలు పెద్దగా ఇచ్చుకోలేమని చెప్పినపుడు శ్రావణ్ అంతగా డిమాండ్ చేయలేదు. కాని ఒక ప్రపోజల్ పెట్టాడు."నా జీతం ప్రతినెలా నా భార్య చేతిలో పెడతాను;అందులో 10పెర్సెంట్ మాత్రం తీసుకుంటాను ఆ డబ్బులు గురించి ఎప్పుడో నన్ను ప్రశ్నించకూడదు". దీనికి అంగీకరిస్తే ఈ సంబంధం నాకిష్టమే"స్తిరంగా చెప్పాడు   శ్రావణ్. 
క్షణం పాటు వసుంధరకు అర్థం కాలేదు. వెంటనే తేరుకొని పదిశాతమేకదా పోనీలే అని సర్దుకొని తన అంగీకారం తెలపటం,ఇద్దరు పిల్లల తల్లయిపోవటం,పెళ్ళయి పాతికేళ్ళు గడిచిపోవటం అంతా కలలా జరిగిపోయింది.                                                                      "ఇక్కడేనమ్మా"     
తేజ కుదిపేసరికి ఈ లోకంలోకొచ్చింది వసుందర. ఓ ఇంటిముందు ఆటో ఆగింది. "అదిగో మీ నాన్న బైకు,ఎన్నాళ్లకు        దొరికారండి ,నా కళ్లుగప్పి ఏకంగా కాపురమే పెట్టేశారా?ఈ రోజు మీ గుట్టు రట్టుచేస్తాను"వగర్చుతూ బైటికే అనేసింది.కొడుకు వారించబోయాడు 
"నీకేం తెలుసురా అప్పుడంటే తక్కువ జీతం కనుక ఒప్పుకున్నాను.ఇప్పుడు 80వేలు జీతం లో టెన్ పెర్సెంట్ తక్కువవా?అదీ ప్రతి నేలాను"అక్కసుగా అంది. 
                                గుమ్మందగ్గరైన శబ్దానికి బైటికొచ్చాడు శ్రావణ్. 
ఎదురుగా ఉన్న భార్యను,కొడుకును చూసి ఆశ్చర్యపోయి,వెంటనే తేరుకొని
 "అదేంటి ఇంత సడెన్ గా వచ్చారు,అయినా ఈ ఇల్లెలా తెలిసింది"? కొడుకును అడిగాడు 
వెంటనే వసుంధర కోపంగా "ఎం బండారం బైటపడిందని కంగారు పడుతున్నారా?"అంటూ గయ మంది                                                                  ఇంతలో ముగ్గురు స్త్రీలు బైటికి వచ్చారు. 
  అందరికీ ఎనభై సంవత్సరాల వయస్సు ఉంటింది.నడవటమే కష్టంగా ఉన్నా మెల్లగా వచ్చారు. పట్టరాని కోపంతో ఇంకా ఏదో అనబోతున్న వసుంధరకు వాళ్లను చూసి నోట మాట రాలేదు.. ఒకామె ముందుకు వచ్చి,
"అమ్మా నువ్వనుకున్నట్టు మా శ్రావణ్ బాబు ఏ తప్పూ చేయలేదమ్మా,మేము ముగ్గురం శ్రావణ్ తల్లికి ప్రాణ స్నేహితులం. ఈ బాబు చిన్న పిల్లాడిగా ఉన్నపుడే ఇతని తల్లి కాలం చేసింది.శ్రావణ్ ను మా చేతిలో పెడుతూ  
జాగ్రత్తలు చెప్పింది. అప్పటినుండి మా పిల్లలతో పాటే పెరుగుతూ వచ్చాడు. వాళ్ళతో కలసి మెలిసి తిరిగినా,వాళ్ల బుద్దులేవీ వీడికి రాలేదమ్మా  మా పిల్లలకు మేం భారమయ్యాం. మా ఆలనా పాలనా తన నెత్తినేసుకొని ,ఇదిగో ఈ ఇల్లు అద్దెకు తీసుకొని మమ్మలను పోషిస్తున్నాడు.వీడికి తల్లి అంటే ఎంతో ఇష్టం . రోజూ వచ్చి మాతో కొంతసమయం గడిపి,మా యోగక్షేమాలు చూసివెళతాడు.ఉన్న కాసేపు వాడి తల్లి  చిన్నప్పటి ఉసులూ,ఆమెబాల్యం,మాతో గడిపిన సంఘటనలు మమ్మలను అడిగి తెలుసుకుంటాడు 
 మా మాటల్లో,నవ్వుల్లో తన తల్లిని వెతుక్కుంటాడు. మాకింత ముద్దపెట్టి మాలో తన తల్లిని చూసుకుంటున్నాడమ్మా నీ భర్త.;తల్లంటే అంత ప్రేమ వీడికి". 
చెప్పుకుపోతున్న ఆ పండుటాకులను చూసి నిష్చేస్టురాలయింది వసుంధర. 
తల్లిని ఇంతగా ప్రేమించే వ్యక్తీ తన భర్త కావటం తన అదృష్టం. తప్పుగా ఊహించి నందుకు ఒకింత సిగ్గుపడి,
శ్రావణ్ కు దగ్గరగా జరుగుతూ  
     "మరు జన్మంటూ ఉంటే నీకు అమ్మని పుడతా"    అప్రయత్నంగా బైటికే అనేసింది వసుంధర
    రెండు కన్నీటిబొట్లు చెంపలపై జారుతూ అతని పాదాలపై పడ్డాయి.    
                                                                      
                 

Tuesday, November 25, 2014

                 భావగీతం 

చుక్కాని కరువైన చిరునావలోన 
దిక్కేదొ తెలియని నా జీవితాన 
వెలుగైతివే నీవు మెరుపైతివే
 కనుతెరిచినంత కనుమరుగైతివే  

నీవు చూసేచూపు నిశిరాత్రి వేళ 
నిదురలేపీ నన్ను పలుకరిస్తుంది 
నవ్వుతున్నా ఏరు నా తీరు చూడ 
ఆకాశ అద్దాన జాబిలయ్యింది                "చుక్కాని "

నీ నుదుట కుంకుమై నే నిలువగానే 
సూరీడు ఈసుతో  నన్ను చూసేను 
తెరచాప మాటునా నీవు దాగున్నా 
సిగలోన మల్లియలు నిను దాచలేవు      "చుక్కాని" 

Wednesday, November 19, 2014

పొగచూరిన జీవితాలు 
అగచాట్లకు ఆనవాలు
 పవరఫుల్ బైకులతో 
లవ్వర్ తో రైడింగులు 
మితిమీరిన గమనాలు 
అతివేగపు సాహసాలు 
కళాశాల చదువంటే 
కులాసాల సంబరాలు 
నిదురనుండి లేస్తూనే 
సెల్లుఫోను గిల్లుకుంటు 
ఏండ్రాయిడ్ మందిరాన 
ఫేసుబుక్కు దర్శనాలు 
ప్రేమంటే యాసిడ్లూ
 ప్రేమంటే కత్తిపోట్లు
 ఎదిరించే లేడి కూన
 తెగనరికే కర్కశాలు 
 ఇదేనా ఇదేనా 
పరుగెత్తే యువవాహిని 
మనకిచ్చే సందేశం 
కనిపెంచే మాతృమూర్తి 
కన్నీట్లో మునుగుతున్నా 
పెంచుకున్న ఆశలన్నీ 
 ఎండమావులవుతున్నా
మీ మనసులు మారవా 
ఆగడాలు ఆగవా  

Thursday, November 13, 2014

మోసపోయా ... 

నీవు 
దాహార్తితో 
తపించినపుడు 
నా వళ్లంతా 
ఒయాసిస్సులే 

నేను 
జీవన కాసారానికై 
నీ దరికొస్తే 
నీ మనసంతా 
మరీచికలే 

Thursday, October 9, 2014

నిరీక్షణ
ఆమె ఎదురు చూస్తుంది
నిలువెల్లా పడిన ముడతలనే
కళ్ళల్లో వత్తులు చేసుకొని 
ఆమె ఎదురుచూస్తుంది
డాలర్లమేతకు వెళ్లిన వలసపక్షి
ఎన్నేళ్ళయినా కన్నవారినీ ఉన్న ఊరినీ
కడగంటైనా చూడనపుడు
విరామమెరుగని
ఎదురు తెన్నులే మిగిలాయి
మస్తిష్కపు చరవాణి పంపిన
వేనవేలు సందేశాలు
అందే ఉంటాయన్న ఆశతో
ఆమె ఎదురుచూస్తుంది
అనంత సాగారాలకావల
ఉజ్వలంగా వెలిగే స్వేచ్చా జ్యోతులను
తీసుకు వస్తాడని ఆశతో కాదు
చిక్కి శల్యమైన శిదిలాలయాన
చిరుదివ్వె వెలిగిస్తాడనే కోరికతో
ఆమె ఎదురుచూస్తుంది
ఉన్నపళంగా వెళ్ళాలనే ఆత్రంలో
విలువైనవే మర్చిపోయాడు
సావాసగాళ్ళతో ఆడిన కోతికొమ్మచ్చి
ఇంటిముందున్న చెట్టుకొమ్మపై
జ్ఞాపకమై వేల్లాడుతోంది
ఊరి కోనేటిలో
ఈదులాడిన బాల్యం
చేపపిల్లలై ఎదురుచూస్తున్నాయి
చిన్నిపెదవులను తాకిన
ఆమె బొటనవేలు
ఇప్పటకీ మారాం చేస్తుంది
కొడుక్కి
గోరుముద్దలు తినిపించాలని
ఎప్పటికైనా వస్తాడనే ఆశతో
తనువంతా ప్రాణమై
ఆమె ఎదురు చూస్తుంది

       నిరీక్షణ   

ఆమె ఎదురు చూస్తుంది 
నిలువెల్లా పడిన  ముడతలనే 
కళ్ళల్లో వత్తులు  చేసుకొని 
ఆమె ఎదురుచూస్తుంది

డాలర్లమేతకు వెళ్లిన వలసపక్షి 
ఎన్నేళ్ళయినా కన్నవారినీ ఉన్న ఊరినీ
కడగంటైనా చూడనపుడు 
విరామమెరుగని 
ఎదురు తెన్నులే మిగిలాయి    

మస్తిష్కపు చరవాణి పంపిన 
వేనవేలు సందేశాలు 
అందే ఉంటాయన్న ఆశతో 
ఆమె ఎదురుచూస్తుంది

అనంత సాగారాలకావల 
ఉజ్వలంగా వెలిగే స్వేచ్చా జ్యోతులను 
తీసుకు వస్తాడని ఆశతో కాదు

చిక్కి శల్యమైన శిదిలాలయాన 
చిరుదివ్వె వెలిగిస్తాడనే కోరికతో 
ఆమె ఎదురుచూస్తుంది 

ఉన్నపళంగా వెళ్ళాలనే ఆత్రంలో 
విలువైనవే మర్చిపోయాడు 

సావాసగాళ్ళతో ఆడిన కోతికొమ్మచ్చి 
ఇంటిముందున్న చెట్టుకొమ్మపై 
జ్ఞాపకమై వేల్లాడుతోంది 

ఊరి కోనేటిలో 
ఈదులాడిన బాల్యం
చేపపిల్లలై  ఎదురుచూస్తున్నాయి 

చిన్నిపెదవులను తాకిన 
ఆమె బొటనవేలు
ఇప్పటకీ మారాం చేస్తుంది 
కొడుక్కి
గోరుముద్దలు తినిపించాలని

ఎప్పటికైనా వస్తాడనే ఆశతో 
తనువంతా ప్రాణమై 
ఆమె ఎదురుచూస్తుంది