DARPANAM

DARPANAM

Thursday, October 9, 2014

నిరీక్షణ
ఆమె ఎదురు చూస్తుంది
నిలువెల్లా పడిన ముడతలనే
కళ్ళల్లో వత్తులు చేసుకొని 
ఆమె ఎదురుచూస్తుంది
డాలర్లమేతకు వెళ్లిన వలసపక్షి
ఎన్నేళ్ళయినా కన్నవారినీ ఉన్న ఊరినీ
కడగంటైనా చూడనపుడు
విరామమెరుగని
ఎదురు తెన్నులే మిగిలాయి
మస్తిష్కపు చరవాణి పంపిన
వేనవేలు సందేశాలు
అందే ఉంటాయన్న ఆశతో
ఆమె ఎదురుచూస్తుంది
అనంత సాగారాలకావల
ఉజ్వలంగా వెలిగే స్వేచ్చా జ్యోతులను
తీసుకు వస్తాడని ఆశతో కాదు
చిక్కి శల్యమైన శిదిలాలయాన
చిరుదివ్వె వెలిగిస్తాడనే కోరికతో
ఆమె ఎదురుచూస్తుంది
ఉన్నపళంగా వెళ్ళాలనే ఆత్రంలో
విలువైనవే మర్చిపోయాడు
సావాసగాళ్ళతో ఆడిన కోతికొమ్మచ్చి
ఇంటిముందున్న చెట్టుకొమ్మపై
జ్ఞాపకమై వేల్లాడుతోంది
ఊరి కోనేటిలో
ఈదులాడిన బాల్యం
చేపపిల్లలై ఎదురుచూస్తున్నాయి
చిన్నిపెదవులను తాకిన
ఆమె బొటనవేలు
ఇప్పటకీ మారాం చేస్తుంది
కొడుక్కి
గోరుముద్దలు తినిపించాలని
ఎప్పటికైనా వస్తాడనే ఆశతో
తనువంతా ప్రాణమై
ఆమె ఎదురు చూస్తుంది

No comments:

Post a Comment